ఇటీవల యువతలో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు ఉన్న వారిలో కూడా ఈ సమస్య కనిపించడం వైద్యులను, కుటుంబాలను కలవరపెడుతోంది. ఆడుతూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో ఆస్పత్రికి తరలించేలోపే బాధితులు మరణిస్తున్నారు.
డాక్టర్ల చెబుతున్న వివరాల ప్రకారం, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు ప్రధానమైనవి. అదనంగా, సిగరెట్, మద్యం, ఇంకా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతోంది.
వైద్య నిపుణులు చెబుతున్న కీలక సూచన ఏమిటంటే – 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలి. ముఖ్యంగా హృదయ సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె సమస్యలను ముందుగానే గుర్తించి, ప్రాణాలను కాపాడుకోవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతిరోజు తగినంత వ్యాయామం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం – ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడే ప్రధాన మార్గాలని వైద్యులు సూచిస్తున్నారు.