గత ప్రభుత్వం పేదలకు విస్తృత స్థాయిలో గృహస్థలాలను మంజూరు చేసి, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. పెద్ద పెద్ద కాలనీలు ఏర్పాటు చేసి వాటికి ‘జగనన్న కాలనీలు’ అనే పేరు పెట్టింది. అయితే సాధారణ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఈ కాలనీల్లో పనులు ఎక్కువగా నిలిచిపోయాయి.
మౌలిక సదుపాయాలు కల్పించాలంటే భారీ నిధులు అవసరమవడంతో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఫలితంగా, రోడ్లు, నీటి సౌకర్యం, డ్రెయినేజ్ వంటి సదుపాయాల లేమితో చాలా మంది లబ్ధిదారులు తమ ఇళ్లలో నివసించేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఈ నేపథ్యంలో తెనాలి పట్టణ పరిధిలోని నేలపాడు జగనన్న కాలనీలో ఓ లబ్ధిదారుడు తన ఇంటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అప్పులు చేసి కట్టుకున్నా, సదుపాయాల లేమితో ఉండలేక అమ్మేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. ఇల్లు ధరను రూ.9 లక్షలుగా నిర్ణయించారు.
గతంలో కూడా పలువురు లబ్ధిదారులు తమకు వచ్చిన స్థలాలను విక్రయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరలకు ఇళ్లు, స్థలాలు లభ్యమవుతున్నందున కొంతమంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, స్థలాలు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి.
గుంటూరు జిల్లాలో ఓఎల్ఎక్స్‌లో ‘జగనన్న కాలనీ’ ఇల్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.