ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించే ఒక ఆసక్తికర సంఘటన ఆదివారం మంగళగిరిలో చోటుచేసుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణించిన హెలికాప్టర్ నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయింది.
ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారంతా మంగళగిరిలో జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.
కార్యక్రమం ముగిసిన తరువాత మంత్రులు తిరిగి జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారితో కలిశారు. తిరుగు ప్రయాణం సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పంపించిన తెలుగు సంస్కృతికి ప్రతీకలైన కొండపల్లి బొమ్మలను జ్ఞాపికలుగా బహూకరించి, జనసేన నాయకులు తెలంగాణ మంత్రులను వీడ్కోలు పలికారు.