దేశంలోని ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఖాళీల జాబితాను రిజర్వేషన్ ఆధారంగా విడుదల చేసింది. అభ్యర్థులు ఆ జాబితాను కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే, ఈ జాబితాలో రాష్ట్రాల వారీగా లేదా జోన్‌ల వారీగా వివరాలు ఇవ్వలేదు. కేవలం రిజర్వేషన్ వర్గాల ప్రకారమే పోస్టుల వివరాలను పేర్కొన్నారు. ఇది తాత్కాలిక జాబితేనని, తుది ఫలితాల అనంతరం ఖాళీల సంఖ్యలో మార్పులు చేసే అవకాశం ఉందని కమిషన్ స్పష్టం చేసింది.
జూన్ నెలలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఏడాది మొత్తం 14,582 గ్రూప్ 'బి', గ్రూప్ 'సి' పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి టైర్ 1 పరీక్షను ఆగస్టు 13 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్‌లో టైర్ 2 పరీక్ష జరగనుంది.