ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మహిళల ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేయడం పై సమగ్ర చర్చ జరిపి, ఆ తర్వాత అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించేందుకు 'నాలా చట్టం' సవరణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అలాగే, LRS (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్), BRS (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)లపై చర్చించి, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త బార్ పాలసీపై మంత్రివర్గం లో చర్చించి, వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల సీఎం చేపట్టిన సింగపూర్ పర్యటనలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపైనా ఆమోదం ఇచ్చే అవకాశముంది.
కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపడం, ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించడం, పలు ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చించడం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో కీలకంగా ఉండనున్నాయి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర పాలనలో కీలకమైన విధానాలు, పథకాలకు శాసన పరంగా దిశానిర్దేశం జరిగే అవకాశం ఉంది.