పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఉదయం కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్ లో 69వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఎలాంటి ఆధారం లేని తాము బుగ్గమక ప్రాజెక్టు వద్ద 60 ఎకరాలను చదును చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నాం. సదరు వ్యవసాయ భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లా మండల పరిషత్ కార్యాలయంలోని ఉపమండల అభివృద్ధి అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న మండలస్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు (MLCOs) జీతాలను రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా చెల్లించాలని పంచాయతీ రాజ్ మండల లెవల్ కంప్యూటర్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
సీకే దిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో 2008లో ఏపీఐఐసీ సేకరించిన అరెకరం భూమికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని, పరిశీలించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన చమిడిరెడ్డి జనార్థన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిద్ధవటం, అట్లూరు, బద్వేలు మండలాల ప్రజల చిరకాల కోరిక అయిన కడప-పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నానదిపై ఖాదర్ బంగ్లా నుంచి మాచుపల్లె మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్.మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కడప నగరంలో వేలాది మంది ఉన్న కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని అక్కాయపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.