ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాచర్ల నుంచి విజయవాడకు నిత్యం నడిచే ప్యాసింజర్ రైలు (నెం. 67228) టైమింగ్స్‌ను మార్చారు. ఇప్పటివరకు ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు, ఆగస్టు 6, 2025 నుంచి ఉదయం 6:00 గంటలకు బయలుదేరుతుంది.
అంతేకాకుండా, ఈ రైలు మాచర్ల-గుంటూరు మధ్యలో మరింత వేగంగా ప్రయాణించనుంది. గుంటూరుకు 8:30కు, విజయవాడకు ఉదయం 10:55కి చేరుకుంటుంది. మారిన షెడ్యూల్ ప్రకారం, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇకపోతే ఇతర రైళ్ల షెడ్యూల్‌లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. చెంగల్పట్టు-కాకినాడ రైలు అక్టోబరు 2 నుంచి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నడవనుండగా, పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు సోమ, గురు, శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణాల షెడ్యూల్ కూడా కొత్తదే.
ఇక తమిళనాడులోని వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ముందుగానే సర్దుబాటు చేసుకోవాలి.