ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని తెలుగు రాష్ట్రాల అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. రక్తదానం, అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్‌లు నిర్వహిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తదితరులు పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ట్వీట్ చేస్తూ – “లక్షలాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన పవన్ కళ్యాణ్ పాలనలో అద్భుతమైన దృష్టి సారిస్తూ, ఎన్డీయే బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయురారోగ్యాలతో ఉండాలి” అని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఇక టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా పవన్ కళ్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. “పిఠాపురంలో ఎవరిని అడిగినా – ఊరిని బంగారం చేస్తున్నాడు మన MLA అంటున్నారు. మీరు మా దగ్గర ఉండడం మా అదృష్టం. MLA, Deputy CM మాత్రమే కాదు.. మా ఫేవరెట్ హీరో కూడా మీరు” అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు. అభిమానులు స్పందిస్తూ – “మీరు పవన్‌తో సినిమా తీయాలి” అని కోరగా, “అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను” అని బుచ్చిబాబు సమాధానం ఇచ్చారు.