సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే అభిమానుల్లో ఉత్సాహం ఎప్పుడూ ఆకాశమే హద్దు. ఇప్పుడు ఆ క్రేజ్ దేశ సరిహద్దులు దాటి సింగపూర్‌కి చేరింది. రజినీ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ కోసం సింగపూర్‌లోని ఓ కంపెనీ తమ తమిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవు ప్రకటించడం సంచలనం సృష్టించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం, ఆ సంస్థ సినిమా విడుదల రోజే ఫస్ట్ షో టికెట్లు, తినుబండారాల ఖర్చులకు 30 సింగపూర్ డాలర్లు అందించనుంది. దీనిని ఉద్యోగుల సంక్షేమం, ఒత్తిడి తగ్గించే చర్యగా పేర్కొంది. ఈ నిర్ణయం నెట్టింట చర్చనీయాంశమవడంతో పాటు భారతీయ అభిమానుల్లో ఆనందాన్ని రేపింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజినీతో పాటు నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటించాయి. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడైన ఈ చిత్రం, ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో విడుదల కానుంది.
ఇంతటి హైప్ మధ్య, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం కొంతమంది అభిమానుల్లో ఆందోళన కలిగించింది. కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు రజినీ సినిమాల ప్రధాన ఆకర్షణగా ఉండటంతో, ‘ఏ’ సర్టిఫికెట్ వీక్షకుల సంఖ్యపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ‘కూలీ’ ఫీవర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.