విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్, మాజీ సైనికులకు చెందిన భూములకు సంబంధించిన అనుమతి పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అయ్యన్నపాత్రుడి పేరును కూడా ప్రస్తావించారు.
ఈ ఆరోపణలకు స్పందించిన అయ్యన్నపాత్రుడు, విశాఖ మండలం ఎండాడ-2లోని 5.10 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ అవసరమని మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, కాబట్టి తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా తాను విశాఖలో జరిగిన భూ ఆక్రమణలపై గళం విప్పానని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.