ఉగ్రవాద నిర్మూలనకు లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ మూడో రోజూ కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అఖల్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో మొత్తం హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు గాయపడినట్టు అధికారులు తెలిపారు.
పక్కా సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీస్, సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు శుక్రవారం నుంచే అఖల్ అటవీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు అడవిలో నక్కి కాల్పులకు పాల్పడడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
శనివారం జరిగిన కాల్పుల్లో మొదటి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా, రాత్రంతా కొనసాగిన కాల్పుల అనంతరం మంగళవారం ఉదయం మరో ముగ్గురిని హతమార్చారు.
నిన్న హతమైన ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LET) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు చెందినవారని గుర్తించారు. 26 మంది పౌరుల మృతి చెందిన పహల్గాం ఉగ్రదాడికి ఇదే సంస్థ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి.
ఈ ఆపరేషన్ కోసం అత్యాధునిక నిఘా పరికరాలు, నైపుణ్యం కలిగిన ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. అడవుల్లో నక్కి దాగిన ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భారీ మౌలిక సదుపాయాలతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.