రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో 'నో హెల్మెట్.. నో పెట్రోల్' విధానాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానుందని అధికారులు బుధవారం ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్టులు పెట్టుకొనేలా ఇండోర్ లోని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకులకు వస్తే, వారికి ఇంధనం ఇవ్వకుండా నిరాకరించనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ తెలిపారు.
ఆగస్టు 1 నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోలు బంక్ కు వచ్చే ద్విచక్ర వాహనదారులకు ఇంధనం అందించకుండా నిరాకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలను పాటించకపోతే, సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక సంబంధిత బంకు యజమానులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష, రూ.5వేల వరకు జరిమానా విధించ వచ్చని నిబంధనల్లో తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.