ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అధికార యంత్రాంగం భారీగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం అమలుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. రూట్లు, బస్సులు, టికెట్ విధానం వంటి కీలక అంశాలపై ఆర్టీసీ స్పష్టతనిచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11,000కు పైగా బస్సుల్లో 74 శాతం బస్సులను ఈ పథకానికి వినియోగించనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ముఖ్యంగా పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
ఈ నేపథ్యంలో బస్సు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉచితంగా ప్రయాణించే మహిళలకు ‘జీరో టికెట్’ జారీ చేయాలి. అందుకు సంబంధించి కండక్టర్లకు తగిన అవగాహన లేకపోతే అవ్యవస్థలు తప్పవని ఆర్టీసీ భావిస్తోంది.
అలాగే ఎక్కువగా జీరో టికెట్లు ఇచ్చేటప్పుడు సాఫ్ట్‌వేర్ లోపాలు రావచ్చని గుర్తించిన అధికారులు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడంతో పాటు, సిబ్బందికి సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్టీసీ, మొదటి రోజునే ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవలు అందించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని డిపోల పరిధిలోనూ షెడ్యూల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.