ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి త్వరలోనే 20 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు వెల్లడించారు. ఈ నెలాఖరులోపే ప్రకటనలు వెలువడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో అన్ని నోటిఫికేషన్లకీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని సూచించారు.
ఇక, వేలాది మంది అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలపై కూడా స్పష్టత ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తుది జాబితా ఇంకా అందకపోవడం వల్లే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఆ జాబితా రాగానే ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా మినహా మిగతా ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. గ్రూప్-2కు సంబంధించి కంటిచూపు, వినికిడి టెస్టుల వైద్య నివేదికలు కూడా రావాల్సి ఉందని వివరించారు. ఫలితాలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే, అటవీ శాఖ నియామక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్‌ను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై జాగ్రత్తగా వివరాలు నింపాలని, వైట్‌నర్ వాడితే లేదా సమాధానాలు చెరిపితే ఆ పత్రాలను పరిగణనలోకి తీసుకోమని హెచ్చరించారు. మూడు తప్పు సమాధానాలకు ఒక నెగటివ్ మార్కు ఉంటుందని కూడా స్పష్టం చేశారు.