బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కవిత ఇటీవల ప్రవర్తించిన తీరు, చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్న కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడు సోమ భరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి టీ. రవీందర్ రావు ప్రకటన విడుదల చేసి వెల్లడించారు.
ఇటీవల కవిత తన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బందులు కలిగించారు. ముఖ్యంగా హరీశ్ రావు, సంతోష్‌పై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు బహిరంగ వేదికలపై చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు, కేసీఆర్‌పై కేసు పెట్టిన సందర్భంలో "పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత?" అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ లోపలే కాకుండా వెలుపల కూడా పెద్ద సంచలనంగా మారాయి.
కవిత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌తో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ విధానాలపై ఆమె అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తమవుతూ వచ్చింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఆమె వ్యతిరేకించారు. అంతేకాకుండా, కేసీఆర్ చుట్టూ "దెయ్యాలు ఉన్నాయ్" అంటూ చేసిన ఆరోపణలు కూడా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించాయని నేతలు భావిస్తున్నారు.
ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవితపై పార్టీ లోపలే వ్యతిరేకత పెరుగుతుండటంతో చివరికి ఆమెను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చేస్తూ, పార్టీ పట్ల అసహకర ధోరణి ప్రదర్శించిన కవితపై అధిష్టానం క్రమశిక్షణ చర్య తీసుకోవడం తప్పనిసరి అయ్యిందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.