తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతుల భవిష్యత్తును మెరుగుపర్చేందుకు ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకంను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకంపై బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇంధన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ పథకం కింద వచ్చే మూడు సంవత్సరాల్లో 2.10 లక్షల మంది గిరిజన, ఆదివాసీ రైతులకు లబ్ధి చేకూర్చాలని, సుమారు 6 లక్షల ఎకరాల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
పొడు భూముల్లో సాగునీటి కొరతను పరిష్కరించడమే ఈ పథకం లక్ష్యం. విద్యుత్ లేని ప్రాంతాల్లో 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు, బోర్లు లేదా బావుల ద్వారా నీటి వనరులు అందజేయనున్న ప్రభుత్వం, ఈ పథకం కోసం రూ.12,600 కోట్లు వెచ్చించనుంది.
ఇందిర సోలార్ పథకం ముఖ్యాంశాలు:
అటవీ హక్కుల చట్టం (RoFR-2006) కింద పట్టాలు పొందిన గిరిజన రైతులకే అర్హత
2.5 ఎకరాలకుపై భూమి ఉన్న రైతులకు వ్యక్తిగతంగా ఒక యూనిట్
2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారికి గ్రూప్ యూనిట్
విత్తనాలు, ఎరువులు, ఆధునిక సాగుపై శిక్షణ కూడా
వర్షంపై ఆధారపడకుండా పంటలు సాగు చేసే అవకాశమంతా కల్పింపు
అంతేకాక, వ్యవసాయం, 200 యూనిట్ల గృహ విద్యుత్, స్కూళ్లు, కాలేజీల ఉచిత విద్యుత్ పథకాలను ఒకే డిస్కమ్ పరిధిలోకి తీసుకొచ్చేలా కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలంటూ సీఎం సూచించారు.