దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ వివరాలు తప్పనిసరిగా సరిగా ఉండాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు యూఐడీఏఐ చీఫ్ భువనేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ పంపించారు. పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపలలో మార్పులు వస్తాయని, అందువల్ల 5–7 ఏళ్ల మధ్య ఒకసారి, 15–17 ఏళ్ల మధ్య మరోసారి బయోమెట్రిక్స్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని యూఐడీఏఐ హామీ ఇచ్చింది. తల్లిదండ్రులకు ఎలాంటి ఖర్చు లేకుండా పాఠశాలలలోనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆధార్ వివరాలు సరిగా లేకుంటే విద్యార్థులు భవిష్యత్తులో చదువు, ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని యూఐడీఏఐ హెచ్చరించింది.