ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాబోతోంది. హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరు వైపుకు రెండు హైస్పీడ్ కారిడార్ల ప్రణాళిక ఇప్పటికే రూపుదిద్దుకుంది. ఈ రెండు కారిడార్లు అమరావతి మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల రవాణా రంగం పూర్తిగా మారిపోనుంది. బుల్లెట్ రైళ్లు ప్రారంభమైతే కొన్ని గంటల్లోనే ముఖ్య నగరాలకు చేరుకోవచ్చు.
హైదరాబాద్–చెన్నై కారిడార్ కోసం మూడు మార్గాలను పరిశీలించగా, చివరికి 744.5 కి.మీ. మార్గాన్ని ఎంపిక చేశారు. ఈ రూట్‌లో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. ఈ మార్గం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాలకు నేరుగా హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లభిస్తుంది.
హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో కూడా ప్రణాళికలు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం మూడు మార్గాలను పరిశీలించి 576.6 కి.మీ. పొడవైన రూట్‌ను ఎంపిక చేశారు. ఈ రూట్‌లో ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం స్టేషన్లు ప్రతిపాదించారు. కియా కంపెనీ ఉన్న పెనుకొండ సమీపంలో కూడా ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది.
ఈ రెండు కారిడార్లు డబుల్ ట్రాక్, లూప్ లైన్లు, సైడింగ్‌లతో కలిపి నిర్మించనున్నారు. మొత్తం 1,419 కి.మీ. మేర ట్రాక్‌ను చెన్నై రూట్‌లో, 1,363 కి.మీ. మేర ట్రాక్‌ను బెంగళూరు రూట్‌లో వేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణ వేగం పెరగడంతో పాటు పట్టణాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు కూడా విస్తరించనున్నాయి.
ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ప్రయాణం గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పర్యాటక, పారిశ్రామిక రంగాలకు ఇది ఊపిరి పోసేలా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల రూపురేఖలను మార్చే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు తరాలకు సరికొత్త రవాణా సౌకర్యాన్ని అందించనుంది.