ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ క్రీడాకారుల ఆర్థిక భారం తగ్గించింది. ఈ మేరకు మొత్తం రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలు విడుదల చేయగా, రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు లబ్ధి పొందనున్నారు. ఏళ్ల తరబడి బకాయిల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, క్రీడల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడాకారుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర క్రీడా రంగానికి మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు. బకాయిల విడుదలతో క్రీడాకారులలో కొత్త ఉత్సాహం నెలకొని, వారు మరింత కృషి చేసి రాష్ట్రానికి కీర్తి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరఫున రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్‌లో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి మార్గం సుగమం చేస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.