తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7న సాయంత్రం 3.30 గంటల నుండి మరుసటి రోజు సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులో ఉండదు. ఇది దాదాపు 12 గంటల పాటు కొనసాగనుంది. చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1.31 గంటలకు ముగియనుంది. సంప్రదాయ ప్రకారం గ్రహణం ప్రారంభమయ్యే ముందు 6 గంటలకే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా జరుగుతుంది.
సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరవబడతాయి. ఆ సమయంలో సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. తరువాత తోమాల సేవ, కొలువు, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి. ఉదయం 6 గంటల నుండి తిరిగి భక్తులకు స్వామివారి దర్శనం అందుబాటులోకి వస్తుంది. ఈ సందర్భంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని టిటిడి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7 సాయంత్రం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. అలాగే సాయంత్రం 3 గంటల నుండి అన్నప్రసాదం వితరణను నిలిపివేస్తారు. మరల సెప్టెంబర్ 8న ఉదయం 8.30 గంటల నుండి అన్నప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ లోపులో భక్తుల కోసం టిటిడి ప్రత్యేకంగా పులిహోర ప్యాకెట్లు అందించనుంది.
భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే 30 వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేసి, సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి భక్తులకు పంపిణీ చేస్తారు. వీటిని వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు మరియు సేవా సదన్ వద్ద భక్తులకు అందిస్తారు.
ఇదిలా ఉండగా, ఈ సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాద పంపిణీ నిలిపివేయబడుతుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి, తిరుమలకు తమ ప్రయాణాన్ని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.