అమెరికాలో భారత సంతతికి చెందిన మహేంద్ర పటేల్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డాడు. 62 ఏళ్ల పటేల్ జార్జియాలో నివసిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. మార్చిలో ఆయన వాల్‌మార్ట్‌కి వెళ్లినప్పుడు ఓ చిన్నారి ప్రాణాలను రక్షించడానికి ముందడుగు వేశాడు. అక్కడ ఓ మహిళ తన రెండేళ్ల కుమారుడిని మొబిలిటీ స్కూటర్‌లో తీసుకెళ్తుండగా అది అకస్మాత్తుగా ఒరిగిపోవడంతో చిన్నారి కింద పడిపోబోయాడు. వెంటనే స్పందించిన పటేల్ ఆ బిడ్డను కింద పడకుండా కాపాడాడు.
అయితే, మంచికే చేసిన సహాయం అతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ చిన్నారి తల్లి పటేల్‌పై కిడ్నాప్ ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. దాదాపు 47 రోజులు నిర్దోషి అయిన పటేల్ జైలులో గడపాల్సి వచ్చింది. ఆ కాలం తన జీవితంలోనే అత్యంత భయంకరమైన అనుభవమని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
జైలులో ఉన్నప్పుడు అతనికి సరైన ఆహారం, ఔషధాలు అందలేదు. శాకాహారి కావడంతో కేవలం బ్రెడ్, పాలు, పీనట్ బటర్‌తోనే జీవించాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఆయన 17 పౌండ్ల బరువు తగ్గిపోయాడు. తోటి ఖైదీలు అవమానాలు, బెదిరింపులు చేయడంతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. "పిల్లల్ని తింటావా?" అని ఎగతాళి చేస్తే, "లక్షల డాలర్లు ఇస్తే రక్షిస్తాం" అని కొందరు బెదిరించారని పటేల్ వేదనతో చెప్పాడు.
ఇంతలో వాల్‌మార్ట్‌లోని సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వీడియోలో పటేల్ చిన్నారిని కాపాడటానికి మాత్రమే సహాయం చేశాడని స్పష్టమైంది. కిడ్నాప్ ప్రయత్నం అన్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు అని నిరూపితమైంది. దీంతో పోలీసులు అతనిపై కేసులు రద్దు చేశారు.
జైలు జీవితం తనను మానసికంగా, శారీరకంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబం కూడా ఈ సంఘటన వల్ల అవమానాలను ఎదుర్కొన్నదని బాధపడ్డాడు. సోషల్ మీడియాలో తనపై దారుణమైన పోస్టులు పెట్టారని గుర్తు చేసుకున్నాడు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీసులు, డిస్ట్రిక్ట్ అటార్నీ తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు.