రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడం, చెరువుల కట్టలు తెగిపోవడం, రహదారులు దెబ్బతినడం వంటి పరిణామాల కారణంగా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితుల మధ్య ప్రభుత్వం విద్యార్థుల భద్రత దృష్ట్యా 16 జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ నిర్ణయం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఊరటనిచ్చింది.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రత్యేకంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి విద్యాసంస్థలకు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలను బయటకు వెళ్లనీయవద్దని విజ్ఞప్తి చేశారు.
వర్షాల తీవ్రత కారణంగా అనేక రహదారులు తెగిపోవడంతో గ్రామాలు, పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో గత మూడు రోజులుగా నిరంతర వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ ఈరోజు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
స్కూళ్లు మూసివేయడం వల్ల పాఠ్యాంశం దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులు సెప్టెంబర్‌లో రెండో శనివారం భర్తీ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కొన్ని జిల్లాల్లో విద్యార్థులు ఇప్పటికే స్కూళ్లకు వెళ్లిన తర్వాతే సెలవులు ప్రకటించడం వల్ల పిల్లలు తడుస్తూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాల ప్రభావం కనబడుతోంది. అక్కడి పరిస్థితులను బట్టి స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. తాజా సమాచారం ప్రకారం, నగరంలో వచ్చే నాలుగు రోజులపాటు పాఠశాలలు మూసివేయనున్నాయి. రవాణా, విద్యుత్ సరఫరా వంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల భద్రతను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుంటూ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.