ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRJY) దేశ యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం గురించి అధికారికంగా ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతకు ఒకేసారి రూ.15,000 అందించగా, ఆ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలకు ప్రతి ఉద్యోగి పైగా నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకం ఇస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్‌లో చేర్చారు. EPFO (Employees' Provident Fund Organisation)లో తొలిసారిగా సభ్యత్వం పొందిన యువతకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగం సంపాదించిన ప్రతి యువకుడికి ప్రభుత్వం మొత్తం రూ.15,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లిస్తారు. ఉద్యోగంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత రూ.7,500, ఒక సంవత్సరం తర్వాత మిగిలిన రూ.7,500 చెల్లిస్తారు. ఉద్యోగి జీతం రూ.1 లక్షలోపు ఉన్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఆర్థిక పరంగా కొంత భరోసా పొందగలరు. అదే సమయంలో కంపెనీలకు కూడా ప్రోత్సాహకాన్ని అందించడం వల్ల ప్రైవేట్ రంగం మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి ముందుకు వస్తుంది.
కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకంలో కూడా ప్రత్యేకత ఉంది. కొత్తగా ఉద్యోగిని నియమించినందుకు ప్రతీ కంపెనీకి ఒక్కో ఉద్యోగి మీద నెలకు రూ.3,000 చొప్పున ఇవ్వబడుతుంది. ఈ సబ్సిడీని 2 సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. అయితే తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈ రంగంలోని కంపెనీలకు 4 సంవత్సరాల పాటు ఈ సాయం అందించనున్నారు. ఉద్యోగి వేతనం ఆధారంగా కూడా కంపెనీలకు అందే ప్రోత్సాహకంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు రూ.10,000 వరకు జీతం ఉన్నవారిపై కంపెనీకి రూ.1,000, రూ.10,000 నుంచి రూ.20,000 వరకు జీతం ఉన్నవారిపై రూ.2,000, రూ.20,000 పైగా జీతం ఉన్నవారిపై రూ.3,000 చొప్పున అందజేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 6 నెలల గ్యాప్‌లో చెల్లిస్తుంది.
ఈ పథకం ద్వారా కేంద్రం రెండు దిశల్లో ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవైపు యువతకు ఉద్యోగం కల్పించడానికి నేరుగా ఆర్థిక సాయం ఇస్తే, మరోవైపు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకం అందిస్తోంది. అధికారుల అంచనాల ప్రకారం వచ్చే రెండు సంవత్సరాల్లో 1.92 కోట్ల మంది యువత ఈ పథకం ద్వారా ఉద్యోగాల్లో చేరగలరని భావిస్తున్నారు. దీని వల్ల దేశంలో మొత్తం 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం ద్వారా నిరుద్యోగ సమస్యకు కొంతమేర ఉపశమనం లభించనుంది.
ఈ పథకానికి కొన్ని అర్హతా షరతులు కూడా ఉన్నాయి. EPFOలో తొలిసారి చేరే యువత మాత్రమే దీని కింద లబ్ధిదారులుగా పరిగణించబడతారు. అంతకుముందు EPFO ఖాతా కలిగినవారు ఈ పథకానికి అర్హులు కారు. ఉద్యోగి కనీసం ఆరు నెలలు ఒకే కంపెనీలో పనిచేయాలి. జీతం గరిష్టంగా రూ.1 లక్ష లోపు ఉండాలి. అలాగే కంపెనీ కూడా EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి. కొత్తగా ఉద్యోగులను నియమించుకునే సంస్థల్లో 50 మందికి తగ్గ స్టాఫ్ ఉంటే కనీసం ఇద్దరిని, 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి. ఈ విధంగా కేంద్రం రూపొందించిన ఈ పథకం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా, ప్రైవేట్ రంగాన్ని ఉత్సాహపరచి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది.