ఐఫోన్ తయారీలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ రూ.586 కోట్లతో ఆధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్లాంట్‌లో ఐఫోన్ బాడీలు తయారు చేయడానికి అవసరమైన అల్యూమినియం భాగాలు ఉత్పత్తి చేయబడతాయి. దీంతో ఏపీ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో చేరబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 613 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
గురువారం అమరావతిలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ ప్రాజెక్ట్ సహా మొత్తం 30 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీని ద్వారా రాష్ట్రానికి రూ.53,922 కోట్ల పెట్టుబడులు రానుండగా, 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.
ఇందులో భాగంగా చిత్తూరులో రూ.85 కోట్లతో టైరోమెర్ లిమిటెడ్ (120 ఉద్యోగాలు), కుప్పంలో రూ.45 కోట్లతో అలీప్ ప్రతిపాదన (2500 ఉద్యోగాలు) కూడా ఆమోదం పొందాయి. 2027 నాటికి కుప్పం హిందాల్కో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించనుంది. దీంతో కుప్పం టెక్నాలజీ పెట్టుబడులకు హబ్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.