భారత్‌పై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశానికి చెందిన ఆరు చమురు, పెట్రోకెమికల్ కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు అమలు చేసింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసి, మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో మొత్తం 20 గ్లోబల్ కంపెనీలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది.
ఇందులో భారత్‌తో పాటు యూఏఈ, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన సంస్థలూ ఉన్నాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో మధ్యప్రాచ్యంలో అస్థిరతను పెంచుతూ, ఉగ్ర ముఠాలకు ఆర్థిక మద్దతు అందిస్తోంది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు తెస్తోంది. అందుకే ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఈ ఆంక్షలు తప్పనిసరి అయ్యాయి” అని వాషింగ్టన్ ప్రకటించింది.
ఆంక్షల జాబితాలో ఉన్న భారత కంపెనీలు: కాంచన్ పాలిమర్స్: 2024 ఫిబ్రవరి నుంచి జూలై వరకు యూఏఈలోని మధ్యవర్తి సంస్థ ద్వారా 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలిథీన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు.
ఆల్కెమికల్ సొల్యూషన్స్: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 84 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులు దిగుమతి చేసినట్లు అమెరికా ఆరోపించింది.
రమణిక్ ఎల్.ఎస్. గోసాలియా & కంపెనీ: 2024 జనవరి నుండి 2025 జనవరి వరకు 22 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్, టోల్యూన్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణ.
జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024-25లో 49 మిలియన్ డాలర్లకు పైగా ఇరాన్ ఉత్పత్తులు దిగుమతి చేసినట్లు అభియోగం.
గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్: గత ఏడాదిలో 51 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్ కొనుగోలు చేసినట్లు అమెరికా ఆరోపించింది.
పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గత ఏడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణ.
వీటన్నింటినీ అమెరికా ఉద్దేశపూర్వకంగా ఇరాన్‌తో వాణిజ్యం జరిపినట్లు పేర్కొంది. ఆంక్షల అమలుతో, ఈ సంస్థలు లేదా సంబంధిత వ్యక్తుల అమెరికాలోని ఆస్తులు ఫ్రీజ్ కానున్నాయి. అంతేకాక, భవిష్యత్‌లో అమెరికాతో వ్యాపారం చేసే అర్హత కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.