యునైటెడ్ కింగ్డమ్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 100కి పైగా విమానాలు రద్దయ్యాయని సమాచారం.
హీత్రో, గాట్విక్, మాంచెస్టర్, బర్మింగ్హామ్, కార్డిఫ్, ఎడిన్బర్గ్, లండన్ వంటి ప్రధాన ఎయిర్పోర్టుల్లో సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) ప్రకారం, సాంకేతిక సమస్య దాదాపు 20 నిమిషాల తరువాత పరిష్కారమైంది.
"ప్రస్తుతం మా సిస్టమ్స్ అన్నీ యథావిధిగా పని చేస్తున్నాయి. విమాన రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. సమస్య ఎదురైన ఎయిర్పోర్టులతో సమన్వయం కొనసాగుతోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేం విచారిస్తున్నాం," అని ఎన్ఏటీఎస్ పేర్కొంది. హీత్రో ఎయిర్పోర్టు ప్రతినిధి మాట్లాడుతూ, స్వాన్విక్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌లో తలెత్తిన ఈ సాంకేతిక లోపం తమ ఎయిర్పోర్టులో కూడా ప్రభావం చూపిందని తెలిపారు.
ఇక సమస్య పరిష్కరమైనా, ఆలస్యాలు మాత్రం కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని పలు విమానాశ్రయ అధికారులు హెచ్చరించారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే తరహా సాంకేతిక సమస్య 2023 ఆగస్టులోనూ యూకేలో తలెత్తిన విషయం గుర్తు పెట్టుకోవాలి. అప్పుడూ అనేక విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి వేచిచూసే పరిస్థితులు ఎదుర్కొన్నారు.