గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్విలాస్ పైవంతెన నిర్మాణానికి ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. భూసేకరణను వేగవంతం చేసి, ఆర్అండ్‌బికి అవసరమైన భూమిని అప్పగించేందుకు జీఎంసీ కృషి చేస్తోంది. ఇప్పటివరకు సుమారు 60 శాతం భూమి సేకరణ పూర్తయ్యింది. వంతెనకు ఇరువైపులా ఫియర్స్ నిర్మాణానికి గోతులు తవ్వి, కాంక్రీటు పనులు ప్రారంభించారు.
పనులు మొదలైన నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ప్రస్తుతానికి ద్విచక్రవాహనాలు, ఆటోలకు మాత్రమే అనుమతి కల్పించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో వంతెనపై రాకపోకలను పూర్తిగా ఆపేయాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు స్థలాలు అప్పగించిన 65 మంది యజమానులకు, అందులో ఉన్న భవనాలు మరియు నిర్మాణాల విలువ కింద జీఎంసీ దాదాపు రూ.3 కోట్ల పరిహారం చెల్లించింది. ఇదిలా ఉండగా 52 మంది యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మరో 40 మంది స్థలాల అప్పగింతపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పనులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో, వారిలో కొందరు స్వచ్ఛందంగా స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. బుధవారం ఒక్కరోజే ముగ్గురు యజమానులు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
న్యాయస్థానాలను ఆశ్రయించిన వారికి నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలన్న ఆదేశాలు రావడంతో, పైవంతెన నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని జీఎంసీ అధికారులు తెలిపారు.
అదే సమయంలో విద్యుత్ లైన్లు, తాగునీటి పైపులు, మురుగు కాలువల మళ్లింపు పనులు కూడా చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారుల్లో ఆక్రమణలను తొలగించి, వాహనాల రాకపోకలకు అనువుగా విస్తరిస్తున్నారు. కంకరగుంట ఆర్‌యూబీ వద్ద ఏటీఅగ్రహారం, కలెక్టరేట్ వైపు వాహనదారులకు సౌలభ్యం కల్పించే విధంగా పనులు జరుగుతున్నాయి.
ఇక మూడు వంతెనల వద్ద వర్షాకాలంలో వర్షపు నీరు, మురుగునీరు కలసి పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నందున, దానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కంకరగుంట వంతెనకు అనుసంధానమయ్యే రహదారులను విస్తరించి, ట్రాఫిక్ రద్దీ లేకుండా ముందస్తు ప్రణాళికతో పనులు కొనసాగుతున్నాయి.