భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఇప్పుడు చిన్నా-పెద్దా ప్రతి లావాదేవీకి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ఆధారంగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనివల్ల నగదు అవసరం తగ్గినట్టే.
యూపీఐకి కొత్త మలుపు: పిన్ అవసరం లేకుండా చెల్లింపులు!
ప్రస్తుతం యూపీఐ ద్వారా డబ్బులు పంపించాలంటే తప్పనిసరిగా పిన్ నంబర్ అవసరం. కానీ కొందరు తమ పిన్ మర్చిపోవడం, తప్పుగా ఎంటర్ చేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్పులు చేయనుంది.
పిన్ ఫ్రీ యూపీఐ చెల్లింపులు.. ఎలా?
NPCI కొత్తగా తీసుకురానున్న విధానం ప్రకారం, ఇకపై పిన్ నెంబర్ అవసరం లేకుండా కంటి చూపుతో (ఐరిస్ స్కాన్), ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ పద్ధతుల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఈ విధానం వల్ల భద్రత పెరగడంతో పాటు, మోసాలకు అవకాశం తగ్గుతుంది.
భద్రతతో కూడిన వేగవంతమైన చెల్లింపులు
ఈ కొత్త సాంకేతికత వల్ల ఫ్రాడ్ లావాదేవీలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరైనా ఇతరుల పిన్ తెలిసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే ప్రమాదం ఇక ఉండదు. అలాగే వేగంగా, సురక్షితంగా లావాదేవీలు పూర్తయ్యేలా ఉంటుంది.పాత విధానం కొనసాగుతుంది
తర్వాతి దశలో NPCI ఈ కొత్త విధానాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. అయితే పాత విధానాన్ని కొనసాగించాలనుకునేవారికి కూడా అవకాశం ఉంటుంది. అంటే, పిన్‌తో చెల్లింపులు చేయాలంటే యథావిధిగా కొనసాగించవచ్చు.
మొత్తానికి, దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత భద్రతతో, సులభతరంగా మార్చే దిశగా మరో ముందడుగు వేస్తోంది NPCI.