తెలంగాణ నాయకుల బనకచర్లపై చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్… సింగపూర్ పర్యటన నుంచి తిరిగిన తర్వాత ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై స్పందించిన ఆయన, తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వివరించారు.
“బనకచర్ల ప్రాజెక్టుపై ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయి” అని వ్యాఖ్యానించిన లోకేశ్… తెలంగాణకు మిగులు జలాల వాడకం నేరమా? అంటూ ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీటిని రాయలసీమకు తరలించడంలో తప్పేంటని ఆయన నిలదీశారు. నీళ్లు ఉన్నప్పుడు లిఫ్ట్ చేయడమే తగిన పని అని చెప్పారు.
ఓ విలేఖరి అడిగిన “బనకచర్లకు అనుమతులున్నాయా?” అనే ప్రశ్నకు స్పందించిన లోకేశ్… “అనుమతుల్లేకుండా కాళేశ్వరం నిర్మించిన తెలంగాణకు ఓ నిబంధన, ఏపీకి మరో నిబంధననా?” అని ప్రశ్నించారు. కొంతమంది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
“తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పుట్టిన పార్టీ” అని గుర్తు చేసిన లోకేశ్… “తెలుగువారు నెం.1గా ఉండాలన్నదే మా లక్ష్యం. రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టడం సరికాదు” అని హితవు పలికారు. బనకచర్ల ప్రాజెక్టు ఏపీ భూభాగంలోనిది, పూర్తిస్థాయిలో చర్చ జరగాలని కోరుతున్నామని తెలిపారు.
గోదావరి దేవుడిచ్చిన వరమని, దాని నీటిని రాయలసీమ రిజర్వాయర్లను నింపేందుకు వినియోగిస్తున్నామని అన్నారు. “నదుల అనుసంధానం అవసరం, లైనింగ్ చేసి నీళ్లు తరలించడమే మా నిబద్ధతకు నిదర్శనం” అని లోకేశ్ స్పష్టంగా తెలిపారు.