అమెరికా ప్రభుత్వం విధించిన అదనపు టారిఫ్‌ల కారణంగా, భారతదేశం నుంచి జరిగే దాదాపు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గట్టి దెబ్బతీయనుంది.
వస్త్రాలు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు (ప్యానా, రొయ్యలు), తోలు, పాదరక్షలు, జంతు ఆధారిత ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్రాంగాల వంటి అనేక ఉత్పత్తులపై ఈ అదనపు సుంక భారం పడే అవకాశం ఉంది.
అలాగే, పత్తి, మిరపకాయలు, జీడిపప్పు, మామిడిపండ్లు, బంగాళదుంపలు, చేపలు, డెయిరీ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు విధించే అవకాశముందని తెలుస్తోంది.
అయితే, ఈ 25% అదనపు టారిఫ్‌ను తక్షణమే అమల్లోకి తేవడం లేదని ట్రంప్ సర్కార్ తెలిపింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 27వ తేదీ నుంచి ఇది వర్తించనుంది.
అందువల్ల ఇప్పటికే నౌకల్లో ఎక్కిన సరుకులపై లేదా ఆగస్టు 27కు ముందుగా అమెరికా చేరుకునే ఉత్పత్తులపై ఈ అదనపు సుంకం వర్తించదు. అలాగే సెప్టెంబర్ 17 అర్ధరాత్రిలోపు మార్కెట్లోకి ప్రవేశించిన భారతీయ ఉత్పత్తులు కూడా ఈ పెరిగిన సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి.