అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సేవలు బుధవారం రోజున తీవ్రంగా అంతరించిపోయాయి. సంస్థకు చెందిన కంప్యూటర్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా, అమెరికా వ్యాప్తంగా అన్ని ప్రధాన (మెయిన్‌లైన్) విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామంతో వందలాది విమానాలు వివిధ ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి నిలిచిపోయాయి. సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వేలాదిమంది ఎయిర్‌పోర్టుల్లో వేచి చూడాల్సి వచ్చింది. సమస్య పరిష్కారానికి ఇంకొంత సమయం పడుతుందన్న సమాచారం మేరకు, మరిన్ని విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) రంగంలోకి దిగి, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి 'గ్రౌండ్ స్టాప్' ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా షికాగో, డెన్వర్, హ్యూస్టన్, నెవార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి కీలక నగరాల ఎయిర్‌పోర్టుల నుంచి విమానాలు ఎగరకుండా నిలిపివేయబడ్డాయి.
ఇటీవలి కాలంలో ఇటువంటి సాంకేతిక లోపాలు అమెరికా విమానయాన రంగానికి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. గత నెలలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఐటీ వ్యవస్థలో లోపం తలెత్తి, కొన్ని గంటలపాటు విమానాలు ఎగరకుండా నిలిపివేశారు. అంతేకాక, ఈ ఏడాది న్యూయార్క్ ప్రాంతంలో ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు పలు సార్లు పనిచేయకుండా పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌కి సమీపంలోని రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక విమానం సైనిక హెలికాప్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో పలు మరణాలు సంభవించిన విషయం గుర్తుచేసుకోవచ్చు.