ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 హజ్ యాత్రికులకు ఇచ్చిన కీలక హామీని అమలు చేస్తూ, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ ఆర్థిక సహాయాన్ని విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి మక్కా యాత్రకు వెళ్ళే 72 మందికి అందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్రం గతంలో రద్దు చేసిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను మళ్లీ పునరుద్ధరించింది. ఈ పాయింట్ తిరిగి రావడం వల్ల హజ్ యాత్రికులకు సౌకర్యంగా మారింది. హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా ఈ ఆర్థిక సహాయాన్ని వివరించారు.
విజయవాడ నుంచి మక్కా వెళ్లే యాత్రికులకు సుమారుగా రూ.70,000 అదనపు ఖర్చు అవుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం రూ.లక్ష సహాయం అందిస్తూ, వారిపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఈ సహాయం 2026 హజ్ యాత్రికులకూ వర్తించనుంది.
దీంతో, విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకోవాలని యాత్రికులకు సూచిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్‌తో స్థానిక ముస్లిం యాత్రికులకు ప్రయోజనం కలుగుతోంది. హజ్ కమిటీ సీఎం చంద్రబాబును కలిసి, విజయవాడ లేదా గుంటూరు ప్రాంతంలో శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోసమేనూ స్థలం కేటాయించాలని కోరింది.