ఏపీకి చెందిన గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) మరోసారి గొప్ప అవకాశాన్ని అందించింది. గృహాలలో వాడుతున్న అదనపు విద్యుత్ లోడును స్వచ్ఛందంగా క్రమబద్ధీకరించుకునేందుకు గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ పథకానికి జూన్ 30 వరకూ గడువు ఇచ్చినా సరైన అవగాహన లేక చాలామంది వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరోసారి అవకాశం కల్పిస్తూ ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పెంచింది.
ఈ పథకంలో భాగంగా అదనపు లోడును క్రమబద్ధీకరించుకున్న వినియోగదారులకు 50 శాతం వరకు ఛార్జీల రాయితీ లభిస్తుంది. సాధారణంగా కిలోవాట్‌కు రూ.2,500 వరకు ఖర్చు అయ్యే విధంగా ఉండగా, ఇప్పుడు రూ.1,250 చెల్లిస్తే చాలని అధికారులు తెలిపారు. అలాగే ఈ స్కీమ్‌పై మరింత అవగాహన కల్పించేందుకు అధికారులను ఆదేశించినట్లు APERC కార్యదర్శి పేర్కొన్నారు. ఈ చర్యతో విద్యుత్ సరఫరాలో సమస్యలు తగ్గి, లో వోల్టేజ్ ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.