అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలకు ప్రతిస్పందనగా, భారత్ కీలక ఆయుధ కొనుగోలు ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ట్రంప్ తాజా ఆదేశాల మేరకు భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించడంతో, మొత్తం సుంకం 50 శాతానికి పెరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో స్పందించిన భారత్... సుమారు 3.6 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను నిలిపివేసినట్టు రాయిటర్స్ నివేదికలో వెల్లడైంది. స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, బోయింగ్ పీ-8I గూఢచార విమానాల కొనుగోళ్లపై ప్రస్తుతానికి చర్చలు నిలిచిపోయాయి. ఈ ఒప్పందాల కోసం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటన కూడా రద్దయినట్టు తెలిసింది.
ఇక భారత్‌పై ట్రంప్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆర్థిక సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ, రష్యా చమురు తగ్గించేందుకు అమెరికా సమాన ధరకు ఇంధనాన్ని అందించాలన్న సవాలు విసిరింది. ట్రంప్ విధానాలపై దేశంలో పెరుగుతున్న అమెరికా వ్యతిరేకత, జాతీయవాద భావోద్వేగాలు మోదీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతానికి రక్షణ భాగస్వామ్యం, నిఘా సమాచార మార్పిడి, సంయుక్త సైనిక విన్యాసాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి.