తెలుగు చిత్రసీమలో కార్మికుల వేతనాల పెంపు విషయంలో తలెత్తిన వివాదం తీవ్రంగా మారింది. ఫిలిం ఫెడరేషన్ యూనియన్లు, నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు ఫలితంలేకుండా ముగియడంతో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అన్ని రకాల సినిమా షూటింగులను తక్షణం నిలిపివేయాలని నిర్మాతలకు స్పష్టంగా ఆదేశించింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్‌లో షూటింగులు ఒక్కసారిగా స్థగించిపోయాయి.
సినీ కార్మికులకు 30 శాతం వేతనవృద్ధి కల్పించాలని, రోజువారీగానే ఆ పేమెంట్ ఇవ్వాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎక్కువగా ఉన్నాయంటూ, ఫెడరేషన్ వైఖరి ఏకపక్షమని నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఛాంబర్ షూటింగుల నిలిపివేత నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఛాంబర్ అనుమతి లేకుండా స్టూడియోలు, అవుట్‌డోర్ యూనిట్లు ఎలాంటి సేవలు అందించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ఈ వివాదానికి పరిష్కారం కోసం గురువారం కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నేతలతో సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో కూడా ఒప్పందానికి నోచుకోలేదు. ఇప్పుడు ఈ వివాదాన్ని సినీ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మరో నాలుగు రోజుల్లో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు యత్నిస్తామని కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీర శంకర్ తెలిపారు. అప్పటి వరకు షూటింగులు జరగకూడదని ఛాంబర్ స్పష్టం చేసింది. ఫలితంగా పలు పెద్ద సినిమాల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.