గుంటూరులో నకిలీ నోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని రత్నగిరి కాలనీలో నివసించే గోపిరెడ్డి, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ పట్టుబడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం ప్రకారం, వీరు మార్కెట్ ప్రాంతంలో నకిలీ నోట్లు మార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో కొన్ని మంది స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వారిని ఆపి వివరాలు అడగగా, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో విషయం పోలీసులకు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో, వీరితో ఉన్న మరో వ్యక్తి ఒక పెద్ద బ్యాగ్‌తో అక్కడి నుండి తప్పించుకున్నాడు. అతడు తీసుకెళ్లిన బ్యాగ్‌లో కూడా నకిలీ నోట్లు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గోపిరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తూ, నకిలీ నోట్ల మూలం, నెట్వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి, పోలీసుల విచారణను గమనించారు. నకిలీ నోట్ల ముఠా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.