ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్లు ఒక్కసారిగా విరిగిపడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఈ ప్రమాదంలో నాలుగు మృతదేహాలను వెలికి తీయగా, బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన పది మంది కార్మికులను మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు ఒడిశాకు చెందినవారుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ఆదేశించారు.