భారత్-చైనా మధ్య సంబంధాల్లో కీలక మార్పుకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. 2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనా టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారని చైనా అధికారికంగా ప్రకటించింది. ప్రధాని మోదీ పర్యటనను స్వాగతిస్తున్నామని, ఇది ఎస్సీఓకు కొత్త దశకు నాంది పలుకుతుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు.
గల్వాన్ ఘటన తర్వాత సరిహద్దుల్లో నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలు ఇటీవల ఎల్ఏసీ వద్ద గస్తీ వ్యవహారంలో వచ్చిన అంగీకారంతో తగ్గుముఖం పట్టాయి. ఈ సానుకూల వాతావరణంలో మోదీ చైనా పర్యటన జరుగుతోంది. 2019 తర్వాత మోదీ చైనాలో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. పర్యటనకు ముందు ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణ కోసం భారత విదేశాంగ, రక్షణ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు చైనాతో సమావేశాలు జరిపారు. ఉగ్రవాదంపై చైనా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని భారత్ గట్టిగా సూచించింది. ఎస్సీఓ సదస్సు చరిత్రలోనే అతిపెద్దదిగా ఉండనుందని, దాదాపు 20 దేశాల నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నట్లు చైనా ప్రకటించింది.