కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాజోలు నియోజకవర్గంలోని పెదపట్నం లంకలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.9.96 కోట్ల వ్యయంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ యంఎస్ఈ-సిడిపి పథకం కింద చేపట్టబడుతుందని తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు తూర్పు పాలెం, అమలాపురం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం పెదపట్నం లంక, రాజోలు ప్రాంతాల్లో మూడు పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని వెల్లడించారు. రాజోలు నియోజకవర్గంలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతోందని, వార్షికంగా 30 నుండి 40 కోట్ల కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం రైతులు కొబ్బరికాయల తొక్కలు తీసి, ఎండు కొబ్బరికాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పంపుతున్నారని, అక్కడే ప్రాసెసింగ్ జరగడం వల్ల రైతులకు తగిన లాభం అందడం లేదని పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉన్నదని మంత్రి గుర్తు చేశారు. ఈ లోటును అధిగమించేందుకు సమగ్ర అధ్యయనం చేసి జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో కొబ్బరి ఆధారిత 4 కొబ్బరి పీచు యూనిట్లు, 18 కొబ్బరి చాప తయారీ యూనిట్లు, 30 తాళ్ల తయారీ యూనిట్లు, 120 చిన్న మధ్య తరహా కొబ్బరి ఉత్పత్తుల యూనిట్లు ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ సౌకర్యాల లోపం కారణంగా ఉత్పత్తుల విలువ తగ్గుతోందని మంత్రి వివరించారు.
ప్రతిపాదిత కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా కొబ్బరి పొడి, వర్జిన్ ఆయిల్, లారిక్ యాసిడ్, ఎమ్‌సిటి పొడి, కొబ్బరి నీరు, నాటా-డే-కోకో, కొబ్బరి నీటి పొడి, కొబ్బరి పాలు, పాల పొడి, డిసికేటెడ్ పొడి, చిప్స్, యాక్టివేటెడ్ కార్బన్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే సదుపాయాలను కల్పిస్తామని మంత్రి తెలిపారు. అదేవిధంగా నిల్వ సౌకర్యాలు, పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుల జోక్యంపై మంత్రి స్పందిస్తూ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించిన కడియం మండలంలో కొబ్బరి పరిశ్రమ స్థాపనకు భూమి కేటాయింపుపై సానుకూలంగా ఆలోచిస్తామని చెప్పారు. అలాగే వరప్రసాద్ సూచన మేరకు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించేందుకు కలెక్టరును ఆదేశిస్తామని తెలిపారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పారిశ్రామిక క్లస్టర్ల ద్వారా కొబ్బరి సంపూర్ణంగా వినియోగించబడేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు అధిక ఆదాయం అందేలా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు అమలు అయితే ఉమ్మడి గోదావరి జిల్లాల కొబ్బరి రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని, రాష్ట్రంలో కొబ్బరి పరిశ్రమలకు కొత్త ఊపు వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం, అమరావతి నుండి జారీ చేయబడింది.