ఈ కింద ఇవ్వబడిన సమాచారం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం సమాచార సందేశం మాత్రమే!
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఎన్డీఏ బలోపేతం కోసం భాగస్వామ్య పక్షాలకు కీలక పదవులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో, ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి రెండు మంత్రి పదవులు లభించగా, తాజాగా మరో గవర్నర్ పదవిని కూడా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమించారు. ఆయన ఎంపికలో పలు రాజకీయ సమీకరణాలు ప్రభావం చూపాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వివాదరహిత నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు ఈ అవకాశం లభించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ నిర్ణయంలో భాగమైంది. దీంతో ఇప్పుడు రెండో గవర్నర్ పదవి కోసం రాయలసీమకు చెందిన బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరు వినిపించినా, ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన మరో నేతకు దక్కే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన కేఈ క్రిష్ణమూర్తి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆయన 2014-2019 మధ్య డిప్యూటీ సీఎంగా పనిచేసి అనుభవం సంపాదించారు.
అయితే, కేఈ కుటుంబానికి ఇటీవలే రాజకీయంగా గుర్తింపు దక్కింది. ఆయన కుమారుడు 2024 ఎన్నికల్లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. దీంతో కేఈ ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా, ఆయన సీనియారిటీ మరియు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే గవర్నర్ పదవి లభించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గవర్నర్ పదవితో పాటు కేంద్రంలోని మరికొన్ని కీలక నియామకాల్లోనూ టీడీపీ నేతలకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పార్టీ నుంచి జాబితా కోరినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటితో, గవర్నర్ పదవి, కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కుతాయన్నది ప్రస్తుతం ఏపీలోని కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చగా మారింది.