బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు రహదారులు ముంపుకు గురై రాకపోకలు అంతరాయం కలిగిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారం, అల్పపీడనం బలహీనపడినా దాని ప్రభావం కొనసాగుతూనే ఉందని అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వాలిపోతుందని తెలిపింది. ఈ పరిణామం వల్ల మంగళవారం, బుధవారం రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.
మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే బుధవారం సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని APSDMA అధికారులు తెలిపారు. మంగళవారం కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదనంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.
మొత్తం మీద, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వరుణుడు విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తోంది. రైతులు, ప్రయాణికులు, ప్రజలు వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ముంపు పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.