ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని పాహల్‌గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలచివేసింది. ఈ దుర్ఘటనలో కొత్తగా పెళ్లయిన జంటలు, కుటుంబ సభ్యులు గాయపడగా, మరికొందరు తమ ఆత్మీయులను కోల్పోయారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌తో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడడం తమ గాయాలపై ఉప్పు రాసినట్లుగా ఉందని ఒడిషాకు చెందిన ఓ బాధితురాలి వితంతువు ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన 26 మంది పౌరులలో ఆమె భర్త, 43 ఏళ్ల ప్రశాంత్ సత్పతి కూడా ఉన్నారు.
ప్రియదర్శిని ఒడిషాలోని తమ స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడం ఆ దేశానికి ఆర్థికంగా సహాయం చేసినట్టేనని పేర్కొన్నారు. "ఈ దుర్ఘటనలో బాధపడిన 26 కుటుంబాల గురించి మర్చిపోండి. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ బలగాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాల గురించి ఆలోచించండి. ఈ మ్యాచ్ వారి వీర మరణానికి కూడా అవమానమే" అని ఆమె తన బాధను వ్యక్తం చేశారు.
పాహల్‌గామ్ దాడి తర్వాత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనప్పటికీ, ఈ మ్యాచ్‌ను నిర్వహించడానికి అనుమతించడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతిని, ఇలాంటి కార్యకలాపాలు చేసే ముందు ఆలోచిస్తుందని అందరూ భావించారు. కానీ ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలనే నిర్ణయం వారికి ఆర్థికంగా సహాయం చేసినట్లు ఉందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
ప్రశాంత్ సత్పతి అనే వ్యక్తి ఒడిషాలోని బాలాసోర్‌కు చెందినవారు. ఆయన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET) లో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. దాడి జరిగిన రోజున ఆయన తన భార్య, తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి పాహల్‌గామ్‌లో విహారయాత్రకు వెళ్లారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఆయన కూడా ఒకరు.
బీజేపీ ఎంపీ, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మ్యాచ్ గురించి స్పందిస్తూ, పాకిస్తాన్‌తో ఇండియా క్రికెట్ ఆడటం తప్పనిసరి అని వివరించారు. ఈ మ్యాచ్ ఐసీసీ (ICC) లేదా ఏసీసీ (ACC) వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్వహించే టోర్నమెంట్‌లో భాగం. ఇలాంటి అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడుతున్నప్పుడు, పాల్గొనే దేశాలు ఒక నిర్దిష్ట షెడ్యూల్‌ను పాటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఒకవేళ ఏ దేశమైనా మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తే, టోర్నమెంట్ నుంచి ఆ జట్టును తొలగించే అవకాశం ఉంటుందని.మ్యాచ్‌ను ఫోర్ఫిట్ చేస్తే (నిర్ణీత కారణాల వల్ల ఆడకపోతే), ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు లభిస్తాయి. దీనివల్ల టోర్నమెంట్‌లో ఆ జట్టు ప్రయాణం కష్టమవుతుంది అని తెలిపారు.కాబట్టి, రాజకీయంగా భారత్, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదని భావించినా, అంతర్జాతీయ క్రీడా నిబంధనల ప్రకారం తప్పనిసరి అవుతుందని అనురాగ్ ఠాకూర్ వివరించడం జరిగినది.