మనం దసరా పండుగ అంటే విజయవాడ, విజయవాడ అంటే దసరా పండుగ అని అనుకుంటాం. కానీ ఈసారి దసరా పండుగను మైసూర్ దసరాను మించేలా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
అదే 'విజయవాడ ఉత్సవ్'. ఈ వేడుకలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇది విజయవాడ ప్రజలకు, పర్యాటకులకు ఒక పెద్ద పండుగే. ఈ ఉత్సవాలను కృష్ణా నది తీరంతో పాటు నగరంలోని వివిధ మైదానాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. సాధారణంగా చాలామంది ఒక రోజులోనే దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఈసారి అలా కాకుండా, భక్తులు, పర్యాటకులు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఈ ఉత్సవాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల విజయవాడలో పర్యాటకం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నారు.
'విజయవాడ ఉత్సవ్' కోసం అధికారులు దాదాపు 300 కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి:
తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల: ఇక్కడ సంప్రదాయ కళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. శాస్త్రీయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, భక్తి పాటలు, హరికథలు, బుర్ర కథలు, తోలు బొమ్మలాట, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు వంటివి ప్రదర్శిస్తారు. ఇక్కడ 11 రోజుల్లో 100కు పైగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగనున్నాయి.
పున్నమి ఘాట్: కృష్ణా నది తీరంలో ఈ వేడుకలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ డ్రోన్ షో, వాటర్ స్పోర్ట్స్, ఫుడ్ కోర్ట్స్, లేజర్ షో, దాండియా, మ్యూజిక్ కన్సర్ట్స్ ఉంటాయి. ఇక్కడ 11 రోజుల్లో 60 ఈవెంట్స్ జరగుతాయట. డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
విజయవాడ ఎక్స్-పో (గొల్లపూడి): ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత విజయవాడలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్, గ్లోబల్ విలేజ్, ఫుడ్ కోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా జరగనున్నాయి. సినీ అభిమానులకు ఇది ఒక మంచి అవకాశం.
'విజయవాడ ఉత్సవ్'లో సంగీత ప్రియులను అలరించడానికి ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులతో లైవ్ కన్సర్ట్స్ ఏర్పాటు చేశారు. మణిశర్మ, ఆర్.పి పట్నాయక్, కార్తీక్, తైక్కుడమ్ బ్రిడ్జ్, సింగర్ సునీత్, రామ్ మిర్యాల, గీతా మాధురి వంటివారు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహిస్తారు. ఇది సంగీత ప్రియులకు ఒక పండగ లాంటిదే.
అంతేకాకుండా, నగరంలో చాలా ఆసక్తికరమైన కార్యక్రమాలు జరగనున్నాయి. క్రౌన్ ఆఫ్ విజయవాడ (మిస్ అండ్ మిస్టర్), మెగా కార్నివాల్ వాక్, విజయవాడ ఐడల్, అగ్ని అవార్డ్స్, సోషల్ మీడియా అవార్డ్స్, స్వచ్ఛాథాన్ వంటివి ఈ ఉత్సవాల్లో భాగం. అలాగే సిద్దార్థ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో హెలికాప్టర్ రైడ్ కూడా ఉండనుంది. ఇది విజయవాడ ప్రజలకు ఒక కొత్త అనుభవం.
మొత్తం మీద, ఈ 'విజయవాడ ఉత్సవ్' కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, విజయవాడ కళలను, సంస్కృతిని, వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక ప్రయత్నం. ఇది విజయవాడలో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. దసరా పండుగను ఈసారి మరింత ఆనందంగా జరుపుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు.