రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో వాహనాలు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు స్పష్టంగా కనిపించేందుకు ఇకపై ప్రతీ వాహనంపై రిఫ్లెక్టివ్ టేప్స్ మరియు రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరిగా అమర్చుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు రెండు చక్రాల వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, గూడ్స్ క్యారియర్లు, కట్టడ నిర్మాణ వాహనాలు అన్నింటికీ వర్తిస్తాయి.
అంటే చిన్న వాహనం నుండి పెద్ద వాహనం వరకు ప్రతి ఒక్కదానిపై రిఫ్లెక్టివ్ టేప్ మరియు రియర్ మార్కింగ్ ప్లేట్ ఉండాల్సిందే. రాత్రి సమయంలో వాహనం వెనుక నుండి వస్తున్న వాహనాలకు సరిగ్గా కనిపించేలా ఈ టేపులు ఉపయోగపడతాయి. రిఫ్లెక్టివ్ టేప్స్ వెలుతురు పడితే ప్రతిబింబించి దూరం నుంచే వాహనాన్ని గుర్తించేందుకు సహాయపడతాయి. దీంతో రాత్రివేళ జరిగే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ నియమాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాహనదారులు వీటిని తప్పనిసరిగా అమర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించే అవకాశముంది. ముఖ్యంగా గూడ్స్ వాహనాలు, భారీ వాహనాలు రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిపై రిఫ్లెక్టివ్ టేప్స్ లేకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు వాటిని స్పష్టంగా గుర్తించలేకపోతున్నాయి.
చాలా సార్లు ప్రాణాంతక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో రాత్రి సమయంలో విజిబిలిటీ పెరిగి ప్రమాదాల రేటు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనితోపాటు ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, నిర్మాణ సామగ్రి వాహనాలు కూడా తరచుగా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వీటిపై రియర్ మార్కింగ్ ప్లేట్స్ లేకపోవడం వల్ల రాత్రివేళల్లో వాటిని గమనించడం కష్టమవుతుంది. ఈ కొత్త నిబంధనతో ఇలాంటి వాహనాలపై కూడా తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ ప్లేట్స్ అమర్చబడతాయి.
రహదారులపై ప్రయాణించే సాధారణ ప్రజలకు ఇది రక్షణ కవచంలా ఉంటుంది. నిపుణులు చెబుతున్నదేమిటంటే రాత్రి సమయంలో జరిగే ప్రమాదాల్లో 30 నుండి 40 శాతం వరకు వెనుక నుండి ఢీకొట్టే సంఘటనలే ఎక్కువ. ఇప్పుడు ఈ రిఫ్లెక్టివ్ టేప్స్, మార్కింగ్ ప్లేట్స్ కారణంగా ఆ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వాహనదారులు కూడా స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రిఫ్లెక్టివ్ టేప్స్ అమర్చడం మాత్రమే కాకుండా వాహన లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు సేఫ్టీ కేవలం ప్రభుత్వంపై మాత్రమే కాకుండా, ప్రతి డ్రైవర్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను సమాజం మొత్తం స్వాగతిస్తున్నది. చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇది ఎంతో అవసరమైన చర్య అని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రాత్రివేళల్లో లైట్లు సరిగా లేని చోట్ల వాహనాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు ఆ సమస్య తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద వాహనదారుల భద్రత, ప్రజల ప్రాణాల రక్షణ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితమైంది. ఇకపై రాత్రివేళల్లో వాహనాలు రహదారులపై మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీనితో రోడ్డు ప్రమాదాలు తగ్గి అనేకమంది ప్రాణాలు రక్షించబడతాయి.