ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, పాత రహదారుల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కొత్త రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇందుకోసం రూ.63 కోట్ల 52 లక్షల రూపాయల వ్యయంతో నాబార్డు నిధులను వినియోగించనున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, రాజమహేంద్రవరం పరిధిలోని ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే ఎస్‌ఈ, సీఈ స్థాయి అధికారుల అనుమతులు లభించాయి. కొన్నిరహదారి పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించే దశలో అధికారులు ఉన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా వాండ్ర–సీసలి, ఉరదాళ్లపాలెం–దువ్వ, మార్టేరు–ప్రక్కిలంక, కానూరు–లంకలకోడేరు, చేబ్రోలు–దేవులపల్లి వంటి మార్గాల్లో కొత్త రహదారులు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటికి రూ.2.65 కోట్లు నుండి రూ.5 కోట్లు వరకు వ్యయం కానుంది. అలాగే నరసాపురం–అశ్వారావుపేట, పాలకొల్లు–దొద్దిపట్ల, పెనుమంట్ర–వీరవాసరం, పాలకొల్లు–ఆచంట వంటి రహదారుల పనులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఈ చర్యలతో జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగై, మౌలిక వసతుల రూపురేఖలు మారనున్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ రహదారుల ప్రాజెక్టులు పూర్తయితే, రవాణా సౌలభ్యం పెరిగి, వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి ఊతం లభించనుంది.