ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసి నెల రోజులు గడిచిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ మంచి వార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ ప్రాథమిక జాబితా అధికారిక వెబ్‌సైట్‌లైన http://sportsdsc.apcfss.in, http://sports.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవాలని శాప్ ఎండీ అజయ్‌జైన్ తెలిపారు.
విడుదలైన ప్రాథమిక జాబితాలో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, ఆగస్టు 13 అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలు పరిష్కరించిన తరువాత తుది జాబితాను విద్యాశాఖకు పంపిస్తారు. ఇప్పటికే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినది. తుది జాబితా సిద్ధమయిన వెంటనే విడుదల చేసి, నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
గమనించదగ్గ విషయం ఏంటంటే, మొత్తం 16,347 పోస్టుల భర్తీకి జూన్ 6 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని తుది ఆన్సర్ కీలను కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలు పూర్తిగా వెల్లడికానున్నాయి.