దేశంలో నమోదు అయిన రాజకీయ పార్టీల జాబితాలో పెద్ద మార్పులు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 334 గుర్తింపులేని పార్టీలను రిజిస్టర్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. నిబంధనల ప్రకారం, ఈసీ వద్ద రిజిస్టర్ అయిన ప్రతి రాజకీయ పార్టీ కనీసం ఆరు సంవత్సరాల్లో ఒకసారైనా ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే, తాజాగా తొలగించిన ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంతో వాటి రిజిస్ట్రేషన్ రద్దయింది.
ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, ఈ పార్టీలు కేవలం పేరుకే ఉన్నాయని, వాటికి భౌతికంగా కార్యాలయాలు కూడా లేవని తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ 334 పార్టీలు తొలగించబడ్డాయి. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపులేని పార్టీలు రిజిస్టర్ అయ్యి ఉండగా, తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది.
ప్రస్తుతం ఈసీ రికార్డుల ప్రకారం, దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు క్రియాశీలంగా ఉన్నాయి. డీలిస్ట్ అయిన పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి — ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 13 పార్టీలు తొలగించబడ్డాయి.
ప్రస్తుతం గుర్తింపు పొందిన జాతీయ పార్టీల జాబితా:
భారతీయ జనతా పార్టీ (BJP)
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPM)
బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)