రాఖీ పండుగ సందర్బంగా నగరంలోని పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లడం ప్రారంభించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదులుతున్నాయి. వనస్థలిపురం, భాగ్యలత, ఆర్టీసీ కాలనీ, హయత్నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హయత్నగర్ బస్టాండ్ వద్ద రహదారి సన్నగా ఉండటం వల్ల అక్కడ వాహనాల కదలిక మరింత మందగించింది. ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లపై కూడా వాహనాలు పెద్ద ఎత్తున చేరడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. హయత్నగర్‌ను దాటిన తర్వాత మాత్రం ట్రాఫిక్ కొంత సులభంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక పండుగ రద్దీ ప్రభావం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కూడా స్పష్టంగా కనిపించింది. ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు వెళ్ళే వాహనాలు రద్దీ కారణంగా నిలిచిపోయాయి. ఉప్పల్, అన్నోజీగూడ ప్రాంతాల నుంచి ఘట్కేసర్ వరకు పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ మార్గంలో ప్రయాణించేందుకు సాధారణంగా 15-20 నిమిషాలు పడుతుండగా, ప్రస్తుతం దాదాపు 50 నిమిషాలు పట్టింది. ప్రయాణం ముందే ప్లాన్ చేసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.