టీవీఎస్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో క్రొత్త అడుగు వేసింది. ఈసారి ఇది సాదారణ స్కూటర్ కాకుండా, మ్యాక్సీ-స్టైల్ డిజైన్‌లో రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయబోతోంది. M1-S అనే పేరుతో పిలవబడుతున్న ఈ మోడల్ త్వరలోనే పలు అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ కానుంది. అయితే, భారత మార్కెట్లో ఇది తక్షణమే అందుబాటులోకి రాకపోయినా, భవిష్యత్తులో భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న iQube సిరీస్‌కి ఇది మంచి తోడ్పాటు కానుంది.
మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ అనేది ఎక్కువ స్థలం, దీర్ఘ ప్రయాణాల్లో సౌకర్యం కోరుకునే రైడర్ల కోసం సరైన ఎంపిక. ఈ కొత్త మోడల్‌కి సంబంధించిన టీజర్ ఇప్పటికే TVS ఇండోనేషియా వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. ఇందులో ఉన్న డిజైన్ హైలైట్స్ చూస్తే, మార్కెట్లో పెరుగుతున్న మ్యాక్సీ-స్కూటర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. విస్తృత సీటింగ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్ స్టైల్ దీన్ని ప్రీమియం టూరింగ్ స్కూటర్‌గా నిలపనున్నాయి.
టీవీఎస్ ఈ మోడల్‌ను EV స్టార్టప్ Iron Mobilityతో భాగస్వామ్యంగా అభివృద్ధి చేసింది. Iron M1-S మోడల్‌ను టీవీఎస్ రీబ్యాడ్జ్ చేసి, తన పేరుతో విడుదల చేస్తోంది. ఇది కేవలం డిజైన్ పరంగా కాకుండా, టెక్నికల్ స్పెసిఫికేషన్లలో కూడా శక్తివంతమైనది.
ఇందులోని హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ 12.5 kW గరిష్ట శక్తిని, వెనుక చక్రానికి 254 Nm టార్క్‌ను అందిస్తుంది. రేటెడ్ టార్క్ 45 Nm. ఈ శక్తితో 0-50 km/h వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరగలదు — ఇది కొన్ని స్పోర్ట్స్ బైక్స్ స్థాయిలోనే. గరిష్ట వేగం 105 km/h, కాబట్టి ఇది నగర రైడ్స్‌తో పాటు హైవే ట్రిప్స్‌కి కూడా సరిపోతుంది.
ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 150 కి.మీ. వరకు ప్రయాణించగలదు, అంటే రోజువారీ ప్రయాణాలకు రేంజ్ టెన్షన్ లేకుండా ఉపయోగించవచ్చు. అదనంగా, 26 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, పొడవైన విండ్స్‌క్రీన్, LED హెడ్లైట్స్, LED టెయిల్ లైట్స్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్పెక్స్‌తో కూడిన స్కూటర్ కోసం మార్కెట్‌లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.