జమ్మూ కశ్మీర్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఒక గూడ్స్ రైలు కశ్మీర్ లోయలోని అనంతనాగ్ పట్టణానికి చేరుకుంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో కీలకమైన బనిహాల్-సంగల్దాన్-రియాసి-కాట్రా సెక్షన్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో కశ్మీర్ లోయ భారత రైల్వేల సరుకు రవాణా కారిడార్‌తో నేరుగా అనుసంధానమైంది. ఈ కొత్త మార్గం ద్వారా సరుకుల రవాణా సులభమవడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది.
ఇప్పటివరకు సరుకుల రవాణా కోసం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ కొండచరియలు విరిగిపడటం, వాతావరణ సమస్యల కారణంగా ఆ రహదారి తరచూ మూసివేయబడేది. ఇప్పుడు రైలు మార్గం అందుబాటులోకి రావడంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఏడాది పొడవునా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా కశ్మీర్‌కు సరుకులను సులభంగా తరలించవచ్చు. ముఖ్యంగా, లోయలో విస్తారంగా పండే యాపిల్స్ వంటి ఉద్యాన ఉత్పత్తులను వేగంగా దేశంలోని ఇతర మార్కెట్లకు చేరవేయడానికి ఇది తోడ్పడనుంది.
ఈ ప్రాజెక్టులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్ వంతెన’ మరియు దేశంలోనే తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ‘అంజి ఖడ్ బ్రిడ్జి’ ఉన్నాయి. మొత్తం 38 సొరంగాలు కలిగిన ఈ రైల్వే మార్గం నిర్మాణం హిమాలయాల కఠిన భౌగోళిక పరిస్థితుల్లో ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచింది. విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు మరియు సామాన్య ప్రజలకు దేశంలోని ఇతర ప్రాంతాలకు సురక్షితంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభించింది. త్వరలోనే కాట్రా-బారాముల్లా రైలు సేవలను జమ్మూ రైల్వే స్టేషన్ వరకు విస్తరించనున్నారు.